ఐసీయూలో సర్కారు విద్య..95 % బడులు బేసిక్ ఫిట్గా లేవు: ఆకునూరి మురళి 

ఐసీయూలో సర్కారు విద్య..95 % బడులు బేసిక్ ఫిట్గా లేవు: ఆకునూరి మురళి 
  • తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి 
  • ప్రభుత్వాలు అబద్ధాలతో టైంపాస్ చేస్తున్నయని ఆరోపణ 
  • టీపీఎఫ్‌‌ విద్యా బస్సు యాత్ర ప్రారంభం

హైదరాబాద్, కొణిజర్ల, వెలుగు: రాష్ట్రంలో సర్కారు విద్యావ్యవస్థ తీవ్రంగా జబ్బు పడి ఐసీయూలో ఉందని, దానికి తక్షణమే చికిత్స చేయాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. స్టేట్ లోని 95 శాతం సర్కారు స్కూళ్లు.. అసలు బడుల కింద లెక్కపెట్టడానికి ఏమాత్రం ఫిట్‌‌గా లేవని, వాటిల్లో కనీస ప్రమాణాలు, సౌకర్యాలు లేవని ఆరోపించారు.  విద్యను ఏదో ఉద్ధరిస్తున్నట్లు పాలకులు నటిస్తూ, మొక్కుబడిగా ఒకటి రెండు పనులు చేసి అదేదో ఘనకార్యమన్నట్లు ప్రజలకు అబద్ధాలు చెబుతూ టైంపాస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం హైదరాబాద్‌‌ ట్యాంక్‌‌బండ్‌‌లోని అంబేద్కర్‌‌ విగ్రహం వద్ద తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (టీపీఎఫ్) ఆధ్వర్యంలో ‘విద్యా బస్సు యాత్ర’ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. పాఠశాల విద్యను బాగుచేయడం గొంతెమ్మ కోరికేమీ కాదని, దీనికోసం భారీ వనరులు కూడా అవసరం లేదన్నారు. ఉన్న బడ్జెట్‌‌ పరిధిలోనే విద్యకు కేటాయింపులు కొద్దిమేర పెంచితే వ్యవస్థ బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు తమ మేనిఫెస్టోలో విద్యకు బడ్జెట్‌‌లో 15 శాతం నిధులు కేటాయిస్తామని, ఆరు గ్యారెంటీల్లో భాగంగా మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కడతామని హామీఇచ్చారని గుర్తుచేశారు.

ప్రైవేట్​విద్యాసంస్థల ఫీజులను నియంత్రిస్తామని చెప్పారని, కానీ ఆ హామీల అమలును గాలికొదిలేశారని విమర్శించారు. దీంతో లక్షలాది మంది పేద విద్యార్థులు బడుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15 న ప్రారంభమైన  ఈయాత్ర 27 వరకు రెండు దశల్లో సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పద్మజాషా, రిటైర్డ్ ఐఏఎస్‌‌లు ఎంవీరెడ్డి, ఎం.చంపాలాల్, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 

విద్యకు 18 శాతం బడ్జెట్ కేటాయించాలి

పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యా బస్సు యాత్ర మంగళవారం రాత్రి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన ఎల్లన్ననగర్‌‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి, డాక్టర్ ఎంవీరెడ్డి, ఎం.చంపాలాల్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌‌లో విద్యారంగానికి కనీసం 18 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు ఉపాధ్యాయుల కొరతను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని కోరారు.

విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, డిజిటల్ సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలని డిమాండ్ చేశారు. బస్సు యాత్ర బృందం మంగళవారం రాత్రి ఎల్లన్ననగర్‌‌లోనే బస చేసి, బుధవారం స్థానిక పాఠశాలల్లోని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిపారు.